కాశి – రెండవ భాగం
గంగ

చాగంటి వారు చెప్పిన సగరుడు, అసమంజసుడు,అంశుమంతుడు, దిలీపుడు ,భగీరథుడు, వాళ్ళ కథలు,  గంగావతరణం వినీ వినీ గంగని కాశీలో చూస్తే భగీరథుడి కష్టం తెలుస్తుంది.

నాకు 8ఏళ్ళ వయసులో మొదటిసారి గంగని చూసాను – హృషీకేశ్ లో. తరువాత చాలా సార్లు చాలా చోట్ల గంగని చూసాను.  బద్రీనాథ్, దేవప్రయాగ, హరిద్వార్ , ప్రయాగ, కాశీ, కలకత్తా. కాశీ గంగ ప్రత్యేకం.

మిగిలినచోట్ల అందరు గంగలో స్నానం చేసి వెళ్ళిపోతారు. కానీ కాశీలో ప్రతీ ఘాట్ ఒడ్డున ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. ఉదయం పూట ఆ ఘాట్ చుట్టుపక్కల వాళ్లు సంధ్యావందనానికి , ఈతకొట్టటానికి, స్నానం చేయటానికి వస్తారు. వాళ్ళ స్నేహితుల్ని కలుసుకుంటారు. 73 ఏళ్ళ ముసలివాళ్ళు ఉంటారు, ఎక్కడో Italy నుంచి కాశీ వచ్చి 23 ఏళ్లుగా ఇక్కడ స్థిరపడిన విదేశీయులు ఉన్నారు, అఖాడాలో కుస్తీ నేర్చుకునేవాళ్ళు ఉంటారు. అందరికి గంగ అమ్మ. గంగని ప్రేమిస్తారు, పూజిస్తారు, తమ జీవితంలో ఒక భాగంగా చూస్తారు.

మొత్తం 84 ఘాట్లు. హరిశ్చంద్రుడు

“ఇచ్చోటనే … ఇచ్చోటనే!!! సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన కరిగిపోయే.


ఇచ్చోటనే … భూములేలు రాజన్యుల , అధికార ముద్రికల్ అంతరించే.

ఇచ్చోటనే..!! లేత ఇల్లాలి నల్లపూసల చౌరు, గంగలో కలసిపోయే.” అని కాటికాపరిగా పనిచేసిన హరిశచెంద్ర ఘాట్,

బ్రహ్మదేవుడు కాశీకి స్వాగతం చెబుతూ పది అశ్వమేధ యాగాలు చేసిన దశాశ్వమేధ ఘాట్, మరాఠా సింధియా కుటుంబం 19వ శతాబ్దంలో నిర్మించిన సింధియా ఘాట్, తులసీదాస్ రామచరితమానస్ గ్రంథం రచించిన తులసీ ఘాట్, పార్వతి దేవి కర్ణాభరణం పడిన స్థలం మణికర్ణిక ఘాట్. ఇలా ఎన్నో కథలు,

సాయంత్రం పడవలో అస్సి ఘాట్ నుంచి, మణికర్ణిక వరకు ప్రయాణం చేసి  గేట్ 1 నుంచి దేవాలయం లోకి వెళ్లి విశ్వనాథుడిని, విశాలాక్షిని , అన్నపూర్ణానని చూసి అన్నపూర్ణ దగ్గర అన్నం తిని దశాశ్వమేధ ఘాట్ లో అద్భుతమైన గంగ హారతి చూసి రోజుని పూర్తి చేయచ్చు.

శీతాకాలం లో పడవ ప్రయాణం ఇంకా బాగుంటుంది. పొగమంచు, Siberian Gull పక్షులు అది ఒక canvas మీద మా జై వేసే పెయింటింగులా ఉంటుంది.

కాశీ లో మేము గడిపిన రోజులు మా బస, భోజనం, దేవాలయాల విశేషాలు నా తదుపరి blog లో వివరిస్తా.

శేషం

Posted in

Leave a comment