కాశీలో మేము
ఈసారి మేము కాశీలో 6 రోజులు ఉన్నాం. కాశీ లో ఉండటానికి 400 రూపాయల నుంచి 40,000 దాక రూములు దొరుకుతాయి. సోనార్పురా వెళ్తే ఎదో రాజమండ్రి వెళ్లినట్టు ఉంటుంది. తెలుగు జనాలు, తెలుగు హోటలు, తెలుగు భోజనం, బోర్డులు కూడా తెలుగులో ఉంటాయి. 1500 కి మంచి గది అద్దెకు దొరుకుతుంది. గంగ వడ్డున 2500-3000 ఉంటాయి గదిలోంచి గంగ కనపడేలా వ్యవస్ధ ఉంటుంది. సోనార్పురా ఒంటరిగా ప్రయాణం చేయాలి అనుకునే అమ్మాయిలకి కూడా సురక్షిత స్థలం.
దేవాలయాలు
కాశీ అనగానే మనకి గుర్తువచ్చేది విశ్వనాథ దేవాలయం. తెల్లవారుఝమున 3 గంటలకి అభిషేకం చేసుకోవచ్చు. కచ్చితంగా టిక్కెట్లు 1 నెల ముందు ఆన్లైన్లో తీసుకోవాలి. 2 గంటలకి లైనులో గేట్ 4 నుంచి వెళ్ళాలి. లైన్లో ముందు ఉంటే అభిషేకం, అలంకారం దగ్గర నుంచి చూడొచ్చు లేదా టికెట్ ఉన్నా కానీ గర్భగుడి బైట టీవీ లోనే చూడాలి. గర్భగుడి చాలా ఇరుకు, అందువల్ల చాలా చాలా తక్కువమందికి నేరుగా చూసే అవకాశం ఉంటుంది. 3-4 టికెట్ ఉన్న వాళ్ళకి అభిషేకం. తరువాత 4-5 టికెట్ లేని వాళ్ళకి. ఐతే ఈ లైన్ లో కాశీ లో నివసిస్తున్న వాళ్ళకి విడిగా క్యూలైన్ ఉంటుంది (aadhar card తప్పనిసరి). అందువలన ఈ లైన్లో తొక్కిసలాట ఎక్కువ. సాధ్యం అయినంతవరకు ఈ దర్శనం avoid చేయటం మంచిది. 5 తరువాత రాత్రి వరకు సర్వ దర్శనం మరియు 300 రూపాయల శీఘ్ర దర్శనం. ఐతే ఇవి ఏవి గర్భగుడిలోకి అనుమతించబడవు. 300 రూపాయల టికెట్ డైరెక్టుగా కూడా దొరుకుతుంది (పండగ రోజులలో online లో reserve చేసుకోవటం మంచిది)



కాలభైరవ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది, ఉదయం 5-7 మధ్యలో వెళ్ళటం మంచిది. విశాలాక్షిని, అన్నపూర్ణనీ చూడటం తేలికే. రద్దీ ఉన్నా దర్శనం త్వరగా అయిపోతుంది. అన్నపూర్ణ క్షేతం లో ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదానానికి విరాళాలు ఇచ్చిన దాతలలో మన తెలుగువాళ్లు సింహభాగంలో ఉండటం చాల గర్వంగా అనిపించింది. తులసి మానస్ మందిరం లో తులసీదాసుగారు రామచరితమానస్ రచించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో కాశీ విశ్వనాథమందిరం సాయంత్రాలు ప్రశాంతతనిస్తాయి. సంకట మోచన్ హనుమాన్ దేవాలయం 16వ శతాబ్దంలో తులసీదాస్ ద్వారా ప్రారంభించబడ్డాయి.

కాశీ చాలా అపరిశుభ్రం గా ఉంటుంది, రోడ్లు రద్దీగా, ఇరుకుగా ఉంటాయి, ఎండాకాలం సూర్యుడు కాశీలో ఉంటాడా అన్నట్టు ఉంటుంది, చలికాలం మధ్యాహ్నం 1 ఐనా సూర్యుడు కనపడదు , కాశీలో కనీసం రోజుకి 8-10 km నడవాలి (డబ్బులు ఉంటె రోజుకి 800-1000 ఆటోలకి ఖర్చు చేయచ్చు), బేరం ఆడటం బాగా రావాలి, ఎప్పుడు 50-100 చిల్లర పెట్టుకోవాలి, పడవ నడిపే MS narayana 500 అడుగుతాడు , 150 కి మించి ఇవ్వకూడదు. Cab తోలే సుబ్రహ్మణ్యం విమానాశ్రయం కి 1200 అడుగుతాడు., 600-700 కి మించాల్సిన పని లేదు. పూజ చేయిస్తా, తాయత్తు కడతా, విశ్వనాథుడిని చూపిస్తా అని బ్రహ్మనందం వస్తాడు ఓ, “नहीं चाहिए” అని తిరస్కరించి వెళిపోవటమే.
వీటికి సిద్ధపడితే కాశీ ఒక మరుపురాని జ్ఞాపకం అవుతుంది.




అభిలాష్ తీసిన గంగా హారతి ఫొటోలు
నాకు తెల్సిన ఒక అమెరికాలో ఉండే తెలుగు అమ్మాయి అలంకృత ఈ మధ్యలో కాలంలో కాశీ ప్రయాణించి “మీరు వెళ్ళాలి” అని ప్రభావితం చేసింది. అలానే స్పందన అని తెల్సిన ఫోటోగ్రాఫర్ కాశీలో ఎన్నో అందమైన ఫోటోలు తీసి “అన్న మీరు వెళ్ళండి “అని ఎన్నోసార్లు చెప్పింది. అలంకృత గారికి, స్పందనకి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు. నాలా ఎంతో మందికి కాశీ అన్నా తిరువణ్ణామలై అన్నా ఒక ఆసక్తిని పెంపొందించిన చాగంటి వారికీ ఈ తరం చాలా రుణపడి ఉంటుంది .
ఇంకో కథతో త్వరలో మళ్ళీ కలుస్తా !!!

Leave a comment