అవి నేను జిమ్ ని సీరియస్ గా తీసుకుంటున్న రోజులు. మేము ఒక 13 మందిమి కలిసి జిమ్ లో ఒక గ్రూపుగా ఉండేవాళ్ళం. ఒకరోజు ఉదయం అందరం కలిసి బీచ్ కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక తెలుగు దోశల బండి దగ్గరకి తీసుకువెళ్లాను . అప్పుడు వచ్చాడు నా దగ్గరకి 13 మందిలో ఒకడు “అన్నా మీరు తెలుగువాళ్ళా” అంటూ . అవును అన్నా, అలా పరిచయం అయ్యాడు బాషా !
అప్పటినుంచి రోజు జిమ్ లో కలిసే వాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం , ఒకరోజు మాటల్లో చెప్పాడు అశోక్ నగర్లో ఒక కేకులు చేసే అమ్మాయి దగ్గర pastry chef గా పనిచేస్తున్నా అని. వాళ్ళది అనంతపురం కానీ ఆ సీమ పౌరుషం ఎప్పుడు కనపడాలా , చాల సౌమ్యంగా, మర్యాదగా మాట్లాడేవాడు. బాషా JNTU అనంతపురం లో బీటెక్ చేసాడు , wipro లో ఉద్యొగం కూడా చేసేవాడు. మనలో చాలా మందికి chef అవ్వాలనో, రైటర్ అవ్వాలనో, ఫోటోగ్రాఫర్ అవ్వాలనో ఆశలు ఉంటాయి. కానీ ఇంట్లోవాళ్ళు ఒప్పుకోరనో లేదా సమాజాం హర్షించదు అనో రకరకాల పరిస్థితులు మనల్ని ఎదో ఒక ఇష్టంలేని ఉద్యోగంలోకి నెట్టేస్తాయి . ఆ సంకెళ్లను లెక్కచేయకుండా బయటికి వచ్చిన వాళ్లలో ఒకడు బాషా. తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరు బస్సు ఎక్కేసాడు . ఆరునెలలు పాటు ఒక హోటల్లో ఉల్లిపాయలు కోయటమే పనిగా ఉద్యోగం లో చేరాడు. అందుకే ఏమో బాషా ఉల్లిపాయలు కట్ చేయడంలో ఆస్కార్ లెవెల్ ప్రజ్ఞ సాధించాడు. తరువాత ఒక cult kitchen లో , ఒక star హోటల్ లో పని చేసాడు . ఆ రెస్టారెంట్లో ఉద్యోగం తను ఇష్టంగా చేస్తున్నా కూడా ఎక్కడో ఎదో ఒక వెలితి . ఆ వెలితి కి సమాధానం కార్తికా స్రవంతి రూపం లో బాషా కి దొరికింది. తన Bakeman Begins pastry షాప్ లో Pastry చెఫ్ గా జాయిన్ అయ్యాడు.
2 నెలలకి కోవిడ్, లాక్డౌన్ మొదలు. అందరి జీవితాలు తలక్రిందులు అయిపోయాయి.చిన్న చిన్న వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి . Cloud kitchen అన్న కాన్సెప్ట్ తరువాత రోజుల్లో బాగా ఊపు అందుకున్న మొదట్లో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయం లోనే ఒక రోజు phone లో బాషా చెప్పాడు , తను పని చేసే Bakeman Begins కూడా తాత్కాలికం గా మూతపడింది అని అలాగే వాళ్ళ hostel కూడా మూసేస్తామని చెప్పేశారని, నేను మా ఊరు వెళ్ళిపోతాను భయ్యా అన్నాడు. ఎంతో కష్టపడి chennai వచ్చిన బాషా lockdown కారణంగా అనంతపురం వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు. రమ్యతో, “బాషా అని ఒక కుర్రాడు gym లో పరిచయం హాస్టల్ మూసేస్తున్నారు అంట మన ఇంటికి వచ్చేయమన్నాను అని చెప్పా” రమ్య నన్ను ఒక్క మాట అడగలేదు . ఆ మరుసటి రోజు బాషా మాఇంటికి వచ్చాడు . ఆ తరువాత 3 నెలల్లో బాషా “మా బాషా” అయిపోయాడు.
కలిసి సినిమాలు చూడటం, కలిసి వంట చేయటం, అతీలతో ఆడటం , బాషా రమ్య కి ఒక తమ్ముడిలా అక్క అక్క అంటూ కూడా ఉండటం 3 నెలలు ఎలా అయిపోయాయో తెలియదు. Master Chef Australia కొన్ని వందల ఎపిసోడ్లు కలిసి చూసేవాళ్ళం. ఎప్పటికైనా ఆ స్థాయికి వెళ్లాలి భయ్యా అనే వాడు. మహాభారతం , రామాయణం మీద బాషా కి ఉన్న పరిజ్ఞానం ఆ వయసు లో చాలా తక్కువ మందిలో నేను చూసాను నేను. తరువాత lockdown రూల్స్ సడలించటంతో బాషా Bakeman Begins లో తిరిగి చేరిపోయాడు. కానీ ప్రతిరోజూ కిచెన్ దగ్గరో జిమ్ లోనో ఏదయినా సినిమా వస్తే సినిమాహాల్లోనో కలుస్తూ ఉండే వాళ్ళం.
బాషా ఏరోజు ఎవరిని ఒక్క మాట అనటం నేను చూడలేదు అంత సహనం ఎలా సాధ్యమో అసలు ఒక మనిషికి . పరిస్థితులు నచ్చకపోతే సర్దుకుపోయే వాడు తప్ప గొడవకు దిగడు . 3 సంవత్సరాలలో బాషా కొన్ని అద్భుతమైన కేక్ లు నాకు రుచి చూపించాడు. తన కిచెన్ లో ఏది కొత్తగా చేసినా “భయ్యా ఒకసారి కిచెన్ కి వస్తావా” అని అడిగే వాడు. నా మీద ప్రేమకాదు . వాళ్ళ అక్కకి (రమ్య కి )ఇవ్వమని ఎదో ఒకటి ఇచ్చి పంపేవాడు నాతో.
2020 రంజాన్ ఉపవాసం మా ఇంట్లో ఉండి , నమాజ్ మా ఇంట్లో చేసుకుని, ఇఫ్తార్ అతీల వాళ్ళ ఇంట్లో చేసేవాడు . ఆ జ్ఞాపకాలు ఇప్పటికి ఆ గదిలో అలానే ఉన్నాయ్ . బాషా చేతి బిర్యానీ తిన్నాక ఇంక జీవితం లో ఇంకో బిర్యానీ ముట్టుకోరు . నా car కొన్నప్పుడు మొదటి డ్రైవ్ బాషాతోనే. ఎన్నో అద్భుతమైన సినిమాలు మేమిద్దరం కలిసి చూసాం. పార్థు పుట్టినప్పుడు బారసాలకి ఎక్కడో అశ్వారావుపేట వచ్చి బారసాల జరుగుతున్నంత సేపు గుడిలో కూర్చుని, పార్ధుని అలా భుజాన వేసుకుని తిప్పాడు. తిరుగు ప్రయాణంలో పులిహోర ప్రసాదం బాక్స్ లో పెట్టుకుని ట్రైన్ ఎక్కి తిని చాలా బాగుంది భయ్యా అని ఇప్పటికీ చెప్తూ ఉంటాడు.
2023 లో బాషా masterchef కి సెలెక్ట్ అయిన రోజు చెప్పాను టైటిల్ విన్నర్ నువ్వే అని. మొత్తం షూటింగ్ అయిపోయాక టెలికాస్టి అవ్వకముందు రమ్య చాలాసార్లు అడిగింది ఎవరు గెలిచారు అని , కంపెనీ పాలసీ , విన్నర్ ఎవరో చెప్పకూడదు అనేవాడు. కానీ రోజూ రాత్రి నేను చెప్పే వాడిని భాషనే గెలుస్తాడు అని రమ్య కి. అనుకున్నట్టుగానే బాషా తెలుగు Masterchef టైటిల్ విన్నర్ అయ్యాడు. హైదరాబాద్ అంతటా పబ్లిసిటీ పోస్టర్లు, సందడి, హంగామా, సోషల్ మీడియా OTTs లో Masterchef తెలిసిన వాళ్ళకి బాషా ఒక సంచలనం. పేపర్ కాలమ్స్, ఇంటర్వ్యూలు, ఫేమ్ ఇలా ఎన్ని వచ్చిన బాషా ఆ రోజు దోశ బండి దగ్గర ఎలా ఉన్నాడో ఈరోజుకి అలాగే ఉన్నాడు. ఆ అశోక్ నగర్ గ్రేస్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న టీషాప్ మేము రోజూ కలిసే ప్రదేశం. ఇప్పటికీ ఆ దారిలో వెళ్తే కారు ఒకసారి ఆపి బాషా కోసం చూస్తూ ఉంటా. ఎందుకు అంటె రోజూ టీ ఉన్న … ఆ సాయంత్రపు బాషా కబుర్లు ఎప్పుడు లోటే !!



హైదరాబాద్ లో ఉన్నా, పనిలో తీరికలేకుండా ఉన్నప్పటికి కూడా నా సలహా ఏదైనా కావాలి అంటే ” భయ్యా ఒక సలహా కావాలి అని చాలా వినయంగా అడుగుతాడు”. నా పాటికి నేను ఏదయినా చెప్తే మీతో మాట్లాడితే హాయిగా ఉంటుంది భయ్యా అంటాడు . అది నా గొప్ప కాదు ఏది చెప్పినా పాజిటివ్ గా వినే, తీసుకునే అతని గొప్ప . ఈ రోజు బాషా నా పక్కన లేడు, నేను instagram లో లేకపోవటం వల్ల బాషా పుట్టినరోజు నాకు గుర్తులేదు , 2 రోజుల క్రితం అయిపోయింది అని తెలిసి, నేను తెలుగులో మొదటి బ్లాగ్ కాశీ మీద రాయాలి అని అనుకున్నా కూడా దానికన్నా బాషా మీద అతని పుట్టినరోజు సందర్భంగా రాయాలి అని అనుకుని ఇదిగో ఇలా మొదలుపెట్టేసా.
పుట్టిన రోజు శుభాకాంక్షలు బాషా భాయ్. ఒక Michelnestar Restaurantని భారతదేశానికి తీసుకురాగలిగే తెలివి, క్రమశిక్షణ , పట్టుదల నీకు ఉన్నాయి. ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి అని ఆశిస్తూ.
నీ భయ్యా ❤️❤️❤️

Leave a comment